: మరో ఉద్యమానికి సిద్ధం.. రైతు సమస్యలపై పోరుబాటకు కోదండరాం నిర్ణయం
తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన టీజేఏసీ మరో పోరుకు సిద్ధమవుతోంది. తెలంగాణలో రైతులు పడుతున్న కష్టాలపై ఉద్యమించాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన అనంతరం టీజేఏసీ చైర్మన్ కోదండరాం మీడియాతో మాట్లాడుతూ.. రైతుల దుస్థితి, పంట రుణాలపై తాము చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మూడో సంవత్సరం కూడా కరవు నెలకొందని అన్నారు. రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాము సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలోనే 'ఛలో హైదరాబాద్' కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కోదండరాం పేర్కొన్నారు. రైతులతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో నష్టపోయిన పంటలను అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సర్కారు వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలని అన్నారు. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద అక్టోబర్ 2న జేఏసీ ఆధ్వర్యంలో మౌనదీక్ష చేపట్టనున్నట్లు, అనంతరం తాము జిల్లాల్లో పర్యటించనున్నట్లు కోదండరాం తెలిపారు.