: చినరాజప్ప పేరుకే హోం మంత్రి!... వైసీపీ నేత అంబటి సంచలన వ్యాఖ్య!
టీడీపీ సీనియర్ నేత, ఏపీ హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్పపై వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తుని విధ్వంసం కేసులో తిరుపతి మాజీ ఎమ్మెల్యే సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా ఆయనకు తోడుగా గుంటూరు సీఐడీ కార్యాలయానికి వచ్చిన అంబటి రాంబాబు అక్కడ ఓ ప్రైవేటు టీవీ ఛానెల్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చినరాజప్పపై కీలక వ్యాఖ్యలు చేశారు. చినరాజప్ప పేరుకే హోం మంత్రి అని, అసలు పోలీసు శాఖలో ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలియదని వ్యాఖ్యానించారు. హోం మంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పే మాటలకు... కోర్టుల్లో ఆ శాఖ దాఖలు చేసే అఫిడవిట్లకు పొంతన లేకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పుకొచ్చారు. తుని ఘటనకు ముందు తాను, భూమన... తుని, విశాఖ పరిధిలో మకాం వేసి రెక్కీ నిర్వహించామని, విధ్వంసం సందర్భంగా సాక్షి ఛానెల్ ప్రసారాలను నిలిపివేయించామని అసెంబ్లీలో చినరాజప్ప చెప్పారని ఆయన పేర్కొన్నారు. అదే విషయంపై కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో హోం శాఖ అసలు ఆ ప్రస్తావనే చేయలేదని అంబటి ఆరోపించారు. న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం కాపులు చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకే ప్రభుత్వం భూమనపై కేసులు నమోదు చేసిందని ఆయన ఆరోపించారు.