: పన్నులన్నీ కలుపుకుని రూ. 949కు 'విస్తారా' విమాన టికెట్లు!
ప్రస్తుత పండగ సీజనులో విమాన ప్రయాణికులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పలు ఎయిర్ లైన్స్ కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తుండగా, పోటీలోకి 'విస్తారా' కూడా వచ్చి చేరింది. మిగతా కంపెనీలు ఇప్పుడు టికెట్లు కొనుగోలు చేసి, మరో మూడు నెలల తరువాత ప్రయాణ తేదీ ఉండాలని చెబుతున్న వేళ, విస్తారా పన్నులన్నీ కలుపుకుని రూ. 949 ప్రారంభ ధరతో టికెట్లు ఇస్తామని, సెప్టెంబర్ లోనే ప్రయాణాలు పెట్టుకోవాలని ఆకర్షణీయమైన ఆఫర్ ను ఇస్తోంది. జమ్మూ శ్రీనగర్ సెక్టారులో రూ. 949కు, గోవా - ముంబై మార్గంలో రూ. 1,099కి, ఢిల్లీ - లక్నో మార్గంలో రూ. 1,399కి, గౌహతి - బగ్డోగ్రా మార్గంలో రూ. 1,999కి టికెట్లు ఇస్తామని పేర్కొంది. ఢిల్లీ - బెంగళూరు రూట్లో రూ. 2,399కి, దేశంలోనే అత్యంత బిజీగా ఉండే ఢిల్లీ - ముంబై రూట్లో రూ. 2,299కి టికెట్లను సెప్టెంబర్ 10 వరకూ అందుబాటులో ఉంచుతామని, ఈ నెల 12 నుంచి 30లోగా ప్రయాణించాల్సి వుంటుందని వెల్లడించింది.