: కర్నూలు జిల్లాలో లాకప్ డెత్?... సంజామల పీఎస్ వద్ద హైటెన్షన్!
కర్నూలు జిల్లాలో లాకప్ డెత్ జరిగిందన్న వార్తలు పెను కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని సంజామల పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. వివరాల్లోకెళితే... సంజామల మండలానికి చెందిన గుర్రప్ప అనే వ్యక్తిని అక్కడి ఎస్సై విజయ భాస్కర్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో నేటి ఉదయం లాకప్ లోనే గుర్రప్ప విగత జీవిగా కనిపించాడు. విషయం తెలుసుకున్న బాధితుడి కుటుంబ సభ్యులు, మీడియా అక్కడికి వెళ్లగా... వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్ లోకి అడుగుపెట్టేందుకు బాధితుడి కుటుంబ సభ్యులతో పాటు మీడియాకు కూడా అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎస్సై కొట్టిన దెబ్బలకు తాళలేకనే గుర్రప్ప మరణించాడని ఆరోపిస్తూ అతడి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.