: రెయిన్ గన్ల పేరు మారింది!...‘పంట రక్షణ’గా మార్చేసిన చంద్రబాబు!
వర్షాభావ పరిస్థితుల్లో పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు రెయిన్ గన్ లను రూపొందించారు. మహారాష్ట్రలోని వర్షాభావ ప్రాంతాల్లో వీటి సహాయంతో వేలాది ఎకరాల్లో పంటలు రైతుల చేతికందాయి. తాజాగా ఏపీలోని అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనూ ప్రభుత్వం రెయిన్ గన్లను వినియోగించి వేలాది ఎకరాల్లో పంటలను కాపాడింది. వారం పాటు రాయలసీమ జిల్లాల్లోనూ మకాం వేసిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... రెయిన్ గన్ లను అప్పటికప్పుడు రంగంలోకి దించారు. అనుకున్న మేర సత్ఫలితాలు రావడంతో మరిన్ని రెయిన్ గన్లను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నేటి ఉదయం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు... రెయిన్ గన్ల పేరును మార్చేశారు. పంటలను వర్షాభావ పరిస్థితుల నుంచి గట్టెక్కిస్తున్న ఈ పరికరాలను ఇకపై ‘పంట రక్షణ’గా పిలవాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.