: 'ఆపరేషన్ తలాష్'కు స్వస్తి... ఏఎన్-32 విమానం సెర్చ్ ఆపరేషన్ స్టాప్!
42 రోజుల క్రితం చెన్నయ్ సమీపంలోని తాంబరం విమానాశ్రయం నుంచి పోర్ట్ బ్లెయిర్ కు బయలుదేరి మార్గమధ్యంలో అదృశ్యమైన భారత వాయుసేన విమానం ఏఎన్-32 సెర్చ్ ఆపరేషన్ ను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ విమానం జాడను తెలుసుకునేందుకు ప్రారంభించిన 'ఆపరేషన్ తలాష్'ను నిలిపివేసినట్టు కోస్ట్ గార్డ్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. విమానం ఆచూకీ విషయంలో ఇంతవరకూ ఎలాంటి క్లూస్ లభించకపోవడం, సముద్రంలో విమానం జాడ తెలిసినా, అందులోని ఎవరూ బతికే అవకాశాలు లేకపోవడంతోనే విమానం వెతుకులాటను నిలిపేసినట్టు తెలుస్తోంది. ఈ విమానంలో సిబ్బంది సహా మొత్తం 29 మంది ప్రయాణించగా, అందులో 8 మంది విశాఖ వాసులు ఉన్న సంగతి తెలిసిందే. పదికి పైగా జలాంతర్గాములు, అంతే సంఖ్యలో యుద్ధనౌకలతో పాటు మలేషియా నుంచి తెప్పించిన ప్రత్యేక నౌక సైతం విమానం ఆచూకీ కనుగొనడంలో విఫలమైంది.