: నవ్యాంధ్రను స్మార్ట్ స్టేట్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం!... సింగపూర్ లో మంత్రి నారాయణ సంకల్పం!
నవ్యాంధ్రప్రదేశ్ ను స్మార్ట్ స్టేట్ గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు. ఈ మేరకు సింగపూర్ లో పర్యటిస్తున్న నారాయణ కీలక ప్రకటన చేశారు. నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణానికి సంబంధించి పలు అధునాతన నగరాలను సందర్శించేందుకు సింగపూర్ వెళ్లిన మంత్రి... అక్కడి సర్బనా, సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్, ఏటోస్ సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతిక పరిఙ్ఞానాన్ని వినియోగిస్తే అద్భుతమైన నగరాలను ఏర్పాటు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. భద్రతకు సంబంధించి ఏటోస్ సంస్థ వద్ద ఉన్న పరిఙ్ఞానాన్ని ఒక్క అమరావతిలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని నగరాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, జనసమ్మర్ధ ప్రాంతాల్లో వినియోగిస్తే మెరుగైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చన్నారు. ఏటోస్ తో పాటు సర్బనా, సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ వద్ద ఉన్న సాంకేతికను వినియోగించుకుని ఏపీని స్మార్ట్ స్టేట్ గా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు.