: నా విషయంలో మోదీ సర్కారును ఏమీ అనవద్దు: ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్


కఠినమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ, వృద్ధి ప్రభావితం అయ్యేందుకే ఎక్కువగా శ్రమించిన తనకు రెండో దఫా అవకాశాన్ని ఇవ్వలేదని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారును నిందించడం భావ్యం కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యానించారు. సంస్కరణల అమలు వేగవంతం చేసేందుకు వడ్డీ రేట్లను తగ్గించడం ఒక్కటే మార్గం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ పదవిని వీడిన తరువాత 'న్యూయార్క్ టైమ్స్' దినపత్రికకు రాజన్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇండియాలో బ్యాంకులను సరిదిద్దే పని కొనసాగుతోందని, తదుపరి గవర్నర్ ఆ బాధ్యతను పూర్తి చేస్తారని అన్నారు. గతంలో బ్యాంకులు ముందూ వెనుకా చూసుకోకుండా రుణాలిచ్చేసి, వాటిని తిరిగి వసూలు చేయడంలో విఫలం అవుతూ రిస్క్ లో పడ్డాయని రాజన్ వ్యాఖ్యానించారు. బ్యాంకు ఆస్తుల నాణ్యతపై సమీక్షలు జరుగుతున్నాయని సెప్టెంబర్ 2013లో 4.2 శాతంగా ఉన్న బ్యాంకుల నిరర్థక ఆస్తుల శాతం ఇప్పుడు 7.6 శాతానికి పెరిగిందని, మొత్తం 14.5 శాతం విలువైన బ్యాంకు రుణాలు ఒత్తిడిలో ఉన్నాయని గుర్తు చేశారు. ప్రపంచంలోని చాలా దేశాలు తక్కువ వడ్డీలకు రుణాలిస్తున్నాయని, ఇప్పటికిప్పుడు ఈ పరిస్థితిని నివారించడం సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నారు. వృద్ధి రేటును ప్రభావితం చేసేందుకంటూ, అమెరికా, యూరప్ సహా పలు దేశాలు వడ్డీ రేట్లను కనిష్ఠ స్థాయుల్లో కొనసాగిస్తున్నాయని, ఈ కారణంతో భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఒత్తిడి పెరుగుతోందని అన్నారు. తన పరపతి విధానం వల్ల వృద్ధి మందగించిన కారణంగానే, రెండో దఫా అవకాశం ఇచ్చేందుకు భారత ప్రభుత్వం నిరాకరించినట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ద్రవ్యోల్బణం లక్ష్యాలను సాధించడంలో తదుపరి గవర్నర్ ఉర్జిత్ పటేల్ విజయం సాధించగలరనే భావిస్తున్నట్టు రాజన్ అన్నారు.

  • Loading...

More Telugu News