: సీఐడీ విచారణకు నేడు భూమన!... ‘తుని’ విధ్వంసం కేసులో కీలక ఘట్టం!
తూర్పు గోదావరి జిల్లా తునిలో ఈ ఏడాది జనవరిలో జరిగిన కాపు ఐక్య గర్జనలో చోటుచేసుకున్న విధ్వంసంపై నేడు కీలక ఘట్టానికి తెర లేవనుంది. కాపు ఐక్యవేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు వేలాదిగా తరలిన కాపులు... పెను విధ్వంసానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో వైసీపీ కీలక నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పంపిన వారే విధ్వంసానికి పాల్పడ్దారని ఏపీ సర్కారు భావిస్తోంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన సీఐడీ అధికారులు విచారణకు రావాలంటూ మొన్న భూమనకు తిరుపతిలో నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల ప్రకారం భూమన నేడు గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ విచారణకు సంబంధించి భూమనకు సంధించాల్సిన ప్రశ్నావళిని సీఐడీ అధికారులు సిద్ధం చేసుకున్నారు.