: స్మార్ట్‌ఫోన్లు ఫ్రీగా కావాలా.. అయితే నన్ను మరోమారు గెలిపించండి: ఓటర్లకు అఖిలేష్ బంపరాఫర్!
ఉత్తరప్రదేశ్‌లో ‘ఉచిత’ జల్లు ప్రారంభమైంది. వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఓటర్లకు తాయిలాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ మరోమారు అధికార పీఠాన్ని అధిరోహించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఓటర్లపై ‘స్మార్ట్ ఫోన్ అస్త్రం’ ప్రయోగించారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజలకు స్మార్ట్‌ఫోన్లను ఉచితంగా ఇస్తానని వరాల జల్లు కురిపించారు. ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటే తాను మళ్లీ పగ్గాలు చేపట్టాక వాటిని ఇస్తానంటూ మెలిక పెట్టారు. తనను గెలిపిస్తేనే ఈ వరం అందుతుందని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా ‘సమాజ్‌వాది స్మార్ట్‌ఫోన్ యోజన’ అనే కొత్త పథకాన్ని సోమవారం ప్రవేశపెట్టారు. 2017 అర్ధభాగం తర్వాత ప్రతీ ఇంటికి అత్యాధునిక స్మార్ట్‌ఫోన్లను డెలివరీ చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ ఫోన్లలో చాలా ఫీచర్లు ఉంటాయని, పేదల నుంచి విద్యావంతుల వరకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఇందులో ఉండే యాప్స్, ఫేస్‌బుక్ ద్వారా ప్రభుత్వ పథకాల గురించి నేరుగా తెలుసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. యూపీలో ఉంటూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఈ పథకానికి అర్హులని పేర్కొంది. అయితే కుటుంబ ఆదాయం లక్ష రూపాయలు దాటితే ఈ పథకం వర్తించదని స్పష్టం చేసింది. వచ్చే వారం నుంచే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు. 2012 ఎన్నికల సందర్భంగా విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరిప్పుడు స్మార్ట్‌ఫోన్లు ఆ పార్టీని మరోమారు గద్దెనెక్కిస్తాయో లేదో వేచి చూడాల్సిందే.