: పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీలో ముదిరిన సంక్షోభం.. ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్న నేతలు
పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. నేతలు ఒకరిపై ఒకరు బురదజల్లుకుంటున్నారు. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్‌వింద్ కేజ్రీవాల్‌కు ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌కు పంజాబ్‌కు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యే దేవేంద్ర షెరావత్ నిన్న బహిరంగ లేఖ రాశారు. సెక్స్ స్కాండల్ వ్యవహారంలో ఉద్వాసనకు గురైన సందీప్ కుమార్‌ను ఆ పార్టీ అధికార ప్రతినిధి అశుతోష్ వెనకేసుకొచ్చిన సంగతి తెలిసిందే. అతడిపై చర్యలు తీసుకునే విషయంలో తాత్సారం చేస్తున్నందుకు లేఖలో విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా పంజాబ్ ఆప్ చీఫ్ సంజయ్‌సింగ్‌పైనా నేరుగా ఆరోపణలు చేశారు. రానున్న ఎన్నికల్లో సీట్లు ఇప్పిస్తానని మహిళల వద్ద నుంచి సింగ్ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. షెరావత్ ఆరోపణలపై సింగ్ మండిపడ్డారు. ఆయన తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే తక్షణం రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తన ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న షెరావత్‌పై పరువునష్టం కేసు పెడతానని హెచ్చరించారు. పంజాబ్‌లో ఆప్‌కు పెరగుతున్న పాప్యులారిటీని దెబ్బతీసేందుకు ఆయన ఆరోపణలను బీజేపీ, అకాలీదళ్ పార్టీలు ఉపయోగించుకుంటున్నాయని అన్నారు. షెరావత్‌పై పరువునష్టం దావా వేసి తీరుతానని సంజయ్ సింగ్ స్పష్టం చేశారు.