: కాబూల్‌ను కుదిపేసిన వరుస బాంబు పేలుళ్లు.. 24 మంది మృతి
వరుస బాంబు దాడులతో కాబూల్ అల్లాడిపోయింది. మురాన్ ఖని, ఆఫ్ఘనిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయాల వద్ద సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లింది. ఈ ఘటనల్లో 24 మంది మృతి చెందగా 91 మంది గాయపడ్డారు. భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో ఉండగానే మరో బాంబు పేలుడు సంభవించింది. అలాగే రాత్రి పొద్దుపోయాక రాయబార కార్యాలయాలు, అంతర్గత మంత్రిత్వ శాఖ కార్యాలయాల వద్ద కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఈ ఘటనలో ప్రాణ, ఆస్తినష్టంపై ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. బాంబు దాడులకు తామే పాల్పడినట్టు తాలిబన్ ప్రకటించింది. మొదటి బాంబు దాడి తర్వాత అక్కడ గుమిగూడిన ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు రెండోసారి బాంబు పేల్చినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. మృతుల్లో ఆర్మీ జనరల్, ఇద్దరు సీనియర్ పోలీస్ కమాండర్లు ఉన్నట్టు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.