: ఆరాధ్యా! ఇది నీవు చదివి అర్థం చేసుకునేటప్పటికి నేను ఉండకపోవచ్చు: గుండెలను తడిమే అమితాబ్ లేఖ
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ హృదయాలను స్పృశించే లేఖను తన మనవరాళ్లకు రాశారు. ఈ లేఖను వారు తన భావంతో అర్థం చేసుకోగలరో? లేదోనన్న అనుమానంతో దానిని రికార్డు చేశారు. శ్వేతా నందా, ఆరాధ్యలకు రాసిన ఈ లేఖ భారతీయలందరి హృదయాలను తడుముతుండగా, ప్రతి తాత, ప్రతి మనవరాలికి చెప్పాలనుకునే మాటలను ఆయన చెప్పారంటూ వేనోళ్ల పొగుడుతున్నారు. ఆయన రాసిన లేఖ వివరాల్లోకి వెళ్తే... "డియర్ నవ్య, ఆరాధ్యా! జీవితంలో తెలియని వ్యక్తుల నుంచే కాదు, తెలిసిన వ్యక్తుల నుంచి కూడా ప్రమాదాలు ఎదురవుతాయి. ఇతరులు ఏం చెబుతున్నారనే దాని గురించి ఎప్పుడూ పట్టించుకోకండి. మీరు ఎలా ఉండాలి? ఎంత సైజులో దుస్తులు ధరించాలి? ఎక్కడికి వెళ్లాలి?... వంటి వారి అభిప్రాయాలను మీ మీద రుద్దడానికి ప్రయత్నిస్తారు. అవేవీ మీ కేరెక్టర్ ని నిర్ణయించలేవు. మీకు పుట్టుకతో దక్కిన గుర్తింపు, ఇంటి పేర్ల ద్వారా సంక్రమించిన పాప్యులారిటీ మిమ్మల్ని ఇబ్బందుల నుంచి బయటపడేయలేవు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మిమ్మల్ని పరిస్థితులను ఎదుర్కొనేలా చేస్తుంది. మీరు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోండి. మీరు మహిళలు కనుక ప్రతి సందర్భంలోనూ ప్రపంచాన్ని ఎదుర్కోవడం కష్టం. ఈ ప్రపంచంలో మహిళలుగా ఉండటం చాలా కష్టం. అయితే ఈ అభిప్రాయాన్ని నా మనవరాళ్లు మారుస్తారని నమ్ముతున్నాను. అప్పుడు ఆరాధ్య, నవ్యల తాతగా పిలిపించుకోవడానికి నేను చాలా గర్వపడతాను. ఏవైనా ఇతర కారణాలు చెప్పి రాజీపడి వివాహం చేసుకోకండి... మీకు ఇష్టమైన వ్యక్తులను మాత్రమే వివాహం చేసుకోండి. మీ జీవితాలను ఇతరులు శాసించేలా చేయకండి. ఎందుకంటే మీ నిర్ణయాలే మిమ్మల్ని నడిపిస్తాయి" అంటూ తన లేఖలో ఆయన వారికి పదనిర్దేశం చేశారు. చివర్లో చిన్నదైన తన మనవరాలు ఆరాధ్యను ఉద్దేశించి మాట్లాడుతూ, "ఈ ఉత్తరాన్ని చదివి నువ్వు అర్థం చేసుకునే సమయానికి నేను నీకు అందుబాటులో ఉండకపోవచ్చు" అని ఆయన పేర్కొన్నారు. అయితే తన మనవరాళ్లకు రాసిన లేఖను ఇంటర్నెట్ లో పెట్టడం వెనుక కారణం ఈ లేఖ ప్రతి తాతయ్య భావన అని, ప్రతి తాతయ్య తన మనవరాళ్లకు ఇలాగే చెబుతారని ఆయన పేర్కొన్నారు. ఈ లేఖ సోషల్ మీడియాను ఆకట్టుకుంటోంది.