: 11 ఏళ్ల శ్రద్ధ గంగానది ఈదడంపై వివాదం... డాక్యుమెంటరీ రూపకర్త ఆరోపణలు
గంగానది శుద్ధి కోసం 11 ఏళ్ల చిన్నారి శ్రద్ధ శుక్లా చేపట్టిన స్విమ్మింగ్ వివాదంలో పడింది. 500 కిలోమీటర్ల గంగా ఈత ఒట్టి బూటకమని ప్రముఖ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ వినోద్ కప్డి ఆరోపించారు. ఈ మొత్తం దూరాన్ని ఆమె ఈదడం లేదని, చాలా భాగం బోటు ద్వారా కవర్ చేస్తోందని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన విడుదల చేశాడు. ఆయన ఆరోపణలపై శ్రద్ధా తండ్రి లలిత్ శుక్లా మండిపడ్డారు. ఆరోపణలు నిజమని నిరూపిస్తే శ్రద్ధతో ఈ ఫీట్ ఇప్పుడే ఆపేయిస్తానని ఆయన తెలిపారు. లేదంటే అతనిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. వినోద్ రూపొందించిన 'కాంట్ టేక్ దిస్ షిట్ ఎనీ మోర్' అనే డాక్యుమెంటరీకి ఆయన 2014లో జాతీయ అవార్డు అందుకున్నారు. మూడు రోజుల పాటు శ్రద్ధ ఫీట్ ను చిత్రీకరించిన ఆయన, ఆమె రోజుకు 500 మీటర్ల దూరం మాత్రమే ఈదుతోందని, నది ఒడ్డున ఎవరైనా మనుషులు కనిపిస్తే వెంటనే నదిలో దిగి ఈత కొడుతోందని ఆయన ఆరోపించారు. ఈ లెక్కన ఆమె రోజుకు గరిష్ఠంగా 3 కిలోమీటర్ల దూరం మాత్రమే ఈదగలదని, మిగిలిన దూరాన్ని బోట్ ద్వారా అధిగమిస్తోందని ఆయన చెప్పారు.