: షూటింగ్ లేకపోతే తాగడమే పని!: రణ్ బీర్ కపూర్ సంచలన వ్యాఖ్యలు
సాధారణంగా సినీ పరిశ్రమలో ఆయా వ్యక్తులకు సంబంధించిన దురలవాట్ల గురించి బయటకు తెలియనీయకుండా జాగ్రత్తపడుతుంటారు. ఒకవేళ పొరపాటున అలాంటివి బయటపడినా, వాటిని తెలివిగా కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. షారూఖ్ ఖాన్, కంగనా రనౌత్, రాణి ముఖర్జీ వంటి వారు చైన్ స్మోకర్లని, ఇక సల్మాన్ మందేస్తే విచక్షణ కోల్పోతాడని పలు సందర్భాల్లో వార్తలొచ్చాయి. తాజాగా తనకు తాగుడు పెద్ద సమస్యగా మారిందని యువ నటుడు రణ్ బీర్ కపూర్ తనకు తానే వ్యాఖ్యానించి కలకలం రేపాడు. తన తాగుడు అలవాటు గురించి రణ్ బీర్ కపూర్ మాట్లాడుతూ, "నేను తాగుతాను. ఇది నాకు ప్రధాన సమస్యగా మారింది. బాగా తాగుతాను. అయితే షూటింగ్ సమయాల్లో మాత్రం తాగను...షూటింగ్ లేకపోతే మందేసుకుని కూర్చుంటాను. నా కుటుంబం, ప్రేయసి.. వీరందర్నీ తలచుకుని వారు మారాలని అనుకుంటాను. అయితే తాగుడే పెద్ద సమస్యగా మారింది. 'అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ' సమయంలో కత్రినాతో సాన్నిహిత్యం మొదలైంది. అప్పటి నుంచే మేము ప్రేమలో వున్నాం" అని తెలిపాడు. కత్రినాపై ఎంత ప్రేముందో చెప్పడానికి మాటలు చాలవని అన్నాడు. ఇక ఈ తాగుడు అలవాటును భరించలేకే కత్రినా అతనికి దూరం జరిగి ఉంటుందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.