: కెప్టెన్ కూల్ కు ఊరట!... మేగజీన్ కవర్ పేజీ వివాదం విచారణను కొట్టేసిన సుప్రీంకోర్టు!
ఓ మేగజీన్ కవర్ పేజీపై విష్ణు రూపంలో దర్శనమిచ్చిన టీమిండియా పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అనంతపురంలోని కోర్టు ధోనీకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. ఆ తర్వాత అలాంటి కేసులోనే ధోనీపై కర్ణాటక హైకోర్టు క్రిమినల్ కేసు దాఖలుకు ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై కెప్టెన్ కూల్ కు తాజాగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ధోనీపై క్రిమినల్ కేసులు పెట్టాలన్న కర్ణాటక హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో ఏ ఒక్కరి సెంటిమెంట్లకు ధోనీ భంగం కలిగించలేదని చెప్పిన సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను నిలుపుదల చేస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.