: హన్మకొండ జిల్లా రద్దు.. తెరపైకి వరంగల్ రూరల్ జిల్లా...పరిశీలనలో 'భద్రకాళి', 'కాకతీయ' పేర్లు!


కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రకటించిన ముసాయిదాపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వెల్లువెత్తుండడంతో కొన్ని జిల్లాల ఏర్పాటు విషయంలో సందిగ్ధంలో పడింది. వరంగల్ జిల్లాను వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలుగా విడగొట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే వరంగల్‌ను వరంగల్, హన్మకొండ జిల్లాలుగా విభజించడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. త్రినగరిగా వెలుగొందుతున్న వరంగల్, హన్మకొండ, కాజీపేటలను ఒకే జిల్లాలో ఉండేలా చూడాలంటూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం తెప్పించుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిన్న తన క్యాంపు కార్యాలయంలో సీఎస్ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా ప్రస్తావన వచ్చినట్టు సమాచారం. ఇదే అంశంపై సీఎం సుదీర్ఘంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. హన్మకొండ జిల్లాకు బదులు వరంగల్ జిల్లానే కొనసాగించాలని కేసీఆర్ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. హన్మకొండ జిల్లాను రద్దుచేసి అందులో ప్రతిపాదించిన మండలాలను వరంగల్ జిల్లాలో కలిపి కొత్తగా వరంగల్ రూరల్ జిల్లాను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. అలాగే కొత్తగా ఏర్పడనున్న వరంగల్ రూరల్ జిల్లాకు భద్రకాళి, లేదంటే కాకతీయ జిల్లా అని పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News