: చిత్తూరు జిల్లా మురకంబట్టులో కాల్పుల కలకలం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కాల్పులు
చిత్తూరు జిల్లా మురకంబట్టులో కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇంటిబయట కూర్చున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దినేష్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఓ బుల్లెట్ దినేష్ ఛాతీలోకి దిగడంతో ఆయన కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దినేష్ గత రెండేళ్లుగా బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతనిపై కాల్పులు జరిపిన దుండగులు హిందీలో మాట్లాడినట్టు ఆయన తల్లిదండ్రులు చెబుతున్నారు. జిల్లాలో తమకు ఎవరితోనూ గొడవలు లేవని వారు పేర్కొన్నారు. బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తులే కాల్పులకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దుండగుల కోసం గాలిస్తున్నారు.