: మాకు 300 కోట్లు ఇచ్చినప్పుడు, ఇంగ్లండ్ కు 900 కోట్లు ఎలా ఇచ్చారు?: బీసీసీఐ ఆగ్రహం
ఐసీసీ, బీసీసీఐ మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. దీనికి కారణం చాంపియన్స్ ట్రోఫీ. 2017 జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వనుంది. క్రికెట్ పుట్టిల్లయిన ఇంగ్లండ్ లో ఈ టోర్నీని నిర్వహించేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ)కి ఐసీసీ (వరల్డ్ క్రికెట్ కమిటీ) 900 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దీనిపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ లో టీ20 వరల్డ్ కప్ నిర్వహణకు కేవలం 300 కోట్ల రూపాయలు ఇచ్చిన ఐసీసీ... ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు 900 కోట్ల రూపాయలు ఎలా ఇస్తోందని ప్రశ్నించింది. కాగా, ఐసీసీ ఛైర్మన్ గా మాజీ బీసీసీఐ చీఫ్ శశాంక్ మనోహర్ ఉండడంతో ఇదెలా సాధ్యమైందని బీసీసీఐ మండిపడుతోంది. దీనిపై దుబాయ్ వేదికగా జరిగే సమావేశంలో ఐసీసీతో అమీతుమీ తేల్చుకోవాలని బీసీసీఐ ఛైర్మన్ అనురాగ్ ఠాకూర్ భావిస్తున్నారు. దీనిపై ఇతర దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఐసీసీ అన్ని దేశాలను ఒకేలా చూడడం లేదని వారు ఆరోపిస్తున్నారు.