: వైద్య విద్య 'బి' కేటగిరీ సీట్ల కౌన్సిలింగ్ ప్రక్రియలో వివాదం... నిలిచిన కౌన్సిలింగ్
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న బీ కేటగిరీ సీట్ల కౌన్సిలింగ్ లో వైద్య విద్య యాజమాన్య కోటా సీట్ల భర్తీలో వివాదం కొనసాగుతోంది. బీ కేటగిరీ సీట్లను కేవలం ఏపీ వారికే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కౌన్సిలింగ్ లో పాల్గొంటున్న వారికి కూడా కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో అధికారులతో తీవ్రవాగ్వాదానికి దిగి, కౌన్సిలింగ్ ప్రక్రియ ముందుకు జరగకుండా విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని, ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు ఏపీలో సీట్లు ఎలా కేటాయిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. తక్షణం మంత్రి వచ్చి తమకు వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో ఏపీ విద్యార్థులకు మాత్రమే సీట్లు కేటాయించాలని పట్టుబట్టారు. దీంతో కౌన్సిలింగ్ నిలిచిపోయింది. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ కాదని, జాతీయస్థాయిలో నిర్వహించే నీట్, ఏఐపీఎంటీ అని ఇందులో ర్యాంకర్లు ఎక్కడైనా కౌన్సిలింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని ఇతర రాష్ట్రాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.