: అఖిలపక్ష బృందానికి హింసతో స్వాగతం పలికిన కాశ్మీర్!
జమ్మూ కాశ్మీర్ లో శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా అఖిలపక్ష బృందం శ్రీనగర్ లో అడుగు పెట్టిన వేళ, లోయలో హింసాత్మక ఘటనలు స్వాగతం పలికాయి. షోపియాన్ ప్రాంతంలో వందలమంది నిరసనకారులు విధ్వంసానికి దిగగా, భద్రతాదళాలు అడ్డుకోవడంతో పదుల సంఖ్యలో ప్రజలకు గాయాలు అయ్యాయి. అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్వయంగా హురియత్ నేత ఒమర్ ఫారూఖ్ కు లేఖ రాసినప్పటికీ, ఇంతవరకూ ఎలాంటి సమాచారమూ వారి నుంచి రాలేదని తెలుస్తోంది. కాగా, శ్రీనగర్ చేరుకున్న రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని ఎంపీల బృందం తొలుత ముఫ్తీని కలిసి చర్చలు జరిపింది. మధ్యాహ్నం తరువాత విపక్ష నేత, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లాతో ఈ బృందం సమావేశం కానుంది. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 30 మంది ఎంపీల బృందం రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. షేర్-ఏ-కశ్మీర్ ఆడిటోరియంలో ఈ సమావేశాలు జరుగుతుండగా, పెద్దఎత్తున భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని పహారా కాస్తున్నాయి.