: యూఎస్ ఓపెన్ రెండో రౌండులోనే నిష్క్రమించిన డిఫెండింగ్ చాంప్స్ పేస్ - హింగిస్ జోడీ
డిఫెండింగ్ చాంపియన్స్ హోదాలో యూఎస్ ఓపెన్ మిక్సెడ్ డబుల్స్ విభాగంలో బరిలోకి దిగిన లియాండర్ పేస్, మార్టినా హింగిస్ జోడీకి రెండో రౌండ్ లోనే చుక్కెదురైంది. ఈ ఉదయం జరిగిన పోటీలో అమెరికా జోడీ కోకో వాందివెగి, రాజీవ్ రామ్ చేతిలో 6-7 (7-1), 6-3, 11-13 తేడాతో ఓడిపోయింది. తొలి సెట్లో హోరాహోరీగా పోరాడి టైబ్రేకర్ లో ఓడిపోయిన పేస్ - హింగిస్ జోడి రెండో సెట్ ను సునాయాసంగానే గెలుచుకుంది. నిర్ణయాత్మకమైన టైబ్రేకర్ లో అమెరికా జోడి 11-13 తేడాతో విజయం సాధించింది. దీంతో మరోసారి యూఎస్ ఓపెన్ గెలవాలన్న వీరి ఆశలు తీరలేదు. గత రాత్రి జరిగిన మెన్స్ డబుల్స్ విభాగపు పోరులో పేస్, జర్మనీకి చెందిన ఆండ్రీ బెగ్ జోడీ కూడా ఓడిపోయింది. ఇదే సమయంలో మరో మిక్సెడ్ డబుల్స్ మ్యాచ్లో రోహన్ బోపన్న, గాబీ డాబ్రాస్కో (కెనడా) జోడీ, లుకాస్ కుబాట్-అండ్రియా హ్లవకోవా జంటపై 5-7, 6-3, 10-7 తేడాతో గెలిచి మూడో రౌండ్కు చేరింది.