: ప్రపంచం ఎటెళ్లాలో చెప్పే స్థాయికి 'బ్రిక్స్' ఎదిగింది!: మోదీ
ఐదు దేశాల 'బ్రిక్స్' సమాఖ్య (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) ప్రపంచానికే దిశా నిర్దేశం చేసే స్థాయికి ఎదిగిందని, అంతర్జాతీయ అజెండా ఏమిటన్నది బ్రిక్స్ కూటమి నిర్ణయించాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కొద్ది సేపటి క్రితం బ్రిక్స్ దేశాధినేతల సమావేశంలో పాల్గొన్న ఆయన, "బ్రిక్స్ దేశాల్లో భాగమైన మన గొంతుక ప్రపంచం ఎటెళ్లాలో చెప్పే స్థాయికి చేరింది. మనపై ఉన్న బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలే ఆర్థిక గమనంలో మిగతా ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. జీ-20 శిఖరాగ్ర సమావేశంలో సైతం మన దేశాల నిర్ణయాలే ప్రధాన చర్చకు వస్తున్నాయి" అని అన్నారు. ఈ ఐదు దేశాలూ తీసుకునే సంయుక్త నిర్ణయాలు మిగతా దేశాల బాధ్యతలను గుర్తు చేసేలా ఉండాలని ప్రధాని అభిలషించారు. అక్టోబర్ లో బ్రిక్స్ సదస్సు గోవాలో జరగనుందని వెల్లడించిన ఆయన, మిగతా దేశాధినేతలను సగౌరవంగా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. అంతకుముందు ఉదయం 9:30 గంటల సమయంలో చైనా అధ్యక్షుడు క్సీ జిన్ పింగ్ ను ప్రధాని మోదీ కలిశారు. కాగా, ఐదు దేశాల బ్రిక్స్ కూటమి ప్రపంచ జనాభాలో 43 శాతం, జీడీపీలో 37 శాతం, వాణిజ్యంలో 17 శాతం ప్రాతినిధ్యంతో ఉన్న సంగతి తెలిసిందే.