: మైక్రో బయాలజీ విద్యార్థిని ప్రాణం తీసిన ప్రాక్టికల్స్!
రసాయనాలతో ప్రాక్టికల్స్ చేస్తున్న వేళ, అవి విషపూరితంగా మారి విద్యార్థిని మరణించిన ఘటన ఓ కళాశాలలో విషాదాన్ని నింపింది. ఈ ఘటన వికారాబాద్ పరిధిలోని ఎస్ఏపీ డిగ్రీ కాలేజీలో జరిగింది. మైక్రో బయాలజీ రెండవ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న శిరీష (20) అనే యువతి, తన రెగ్యులర్ ప్రాక్టికల్స్ లో భాగంగా ల్యాబ్ లో శుక్రవారం రసాయనాలతో ప్రయోగాలు చేస్తోంది. ఆ సమయంలో వెలువడిన పొగను పీల్చిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురికాగా, ఆమెను హుటాహుటిన హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేసినప్పటికీ, పరిస్థితి విషమించి శిరీష మరణించింది.