: 'సత్యం' రామలింగరాజుకు రూ. 6.2 కోట్లు కట్టు: సుజనా చౌదరికి కోర్టు ఆదేశాలు
సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ బి.రామలింగరాజుకు రూ. 6.2 కోట్లను వడ్డీతో సహా చెల్లించాలని హైదరాబాద్ కోర్టు కేంద్ర సహాయ మంత్రి వై.సుజనా చౌదరి, ఆయన కంపెనీలను ఆదేశించింది. గతంలో రుణ రూపంలో రామలింగరాజు కంపెనీల నుంచి సుజనా చౌదరి కంపెనీలు తీసుకున్న రుణంపై, ఒప్పంద పత్రాల్లో రాసుకున్నట్టుగా 18 నుంచి 24 శాతం వడ్డీనీ చెల్లించాలని ఆదేశించింది. కాగా, వడ్డీ కూడా కలుపుకుంటే సుజనా చౌదరి మొత్తం రూ. 17 కోట్ల వరకూ చెల్లించాల్సి వుంటుందని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. రామలింగరాజు స్థాపించిన కంపెనీలు, ఫిన్ సిటీ ఇన్వెస్ట్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైగ్రేస్ ఇన్వెస్ట్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎలెం ఇన్వెస్ట్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల నుంచి ఐదు దఫాలుగా సుజనా చౌదరికి చెందిన కంపెనీలు రుణాలను తీసుకున్నాయి. ఈ రుణాలను సుజనా కాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్, ఫ్యూచర్ టెక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్లాటినా ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీలు తీసుకోగా, రుణాలన్నింటికీ సుజనా గ్యారంటర్ గా సంతకాలు పెట్టారు. ఆయనతో పాటు సుజనా సన్నిహితుడు, కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్న ఆర్.దేవేందర్ రెడ్డి సైతం గ్యారంటీ సంతకాలు చేశారు. 1999 ప్రాంతంలో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలం కాగా, రామలింగరాజు సంస్థలు 2003లో కోర్టును ఆశ్రయించాయి. వాదనలు విన్న న్యాయస్థానం ఈ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని తీర్పిచ్చింది.