: అమెరికాకు చైనా ఝలక్... మోదీకి రెడ్ కార్పెట్ వేసిన చైనా, ఒబామాకు విమానం మెట్లు దిగే స్టెయిర్ కేస్ కూడా వెయ్యలేదు!


జీ-20 సమావేశాలకు హాజరయ్యేందుకు చైనాకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను సాధ్యమైనంతగా అవమానించాలని చైనా నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలకలేదు సరికదా... కనీసం విమానం దిగేందుకు స్టెయిర్ కేసును కూడా వేయలేదు. దీంతో విమానం అత్యవసర ద్వారాన్ని తెరచుకుని ఆయన కిందకు దిగాల్సి వచ్చింది. ఒబామాతో పాటు వచ్చిన అమెరికా మీడియాను సైతం ఆయన దగ్గర ఉండనీయకుండా చైనా అడ్డుకుంది. దీనిపై అమెరికా అధికారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా, "ఇది మా దేశం, మా ఎయిర్ పోర్ట్... రూల్స్ మేమే నిర్ణయిస్తాం" అని చైనా అధికారి ఒకరు కాస్తంత గట్టిగానే సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు సుసాన్ రైస్ ను సైతం ఒబామాకు దూరంగా ఉంచారని తెలుస్తోంది. చైనా ప్రభుత్వం తాము ఊహించని విధంగా ప్రవర్తించిందని సుసాన్ వ్యాఖ్యానించడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడిని అవమానించిన చైనా, తమ గడ్డపై కాలుమోపిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రం రెడ్ కార్పెట్ పరిచి ఘనంగా స్వాగతం పలికింది. చైనా ఉన్నతాధికారులు ఆయన్ను సాదరంగా ఆహ్వానించి అతిథి గృహానికి తీసుకెళ్లారు. బరాక్ ఒబామా ఎమర్జెన్సీ స్టెయిర్ కేస్ ద్వారా దిగుతున్న దృశ్యాలు, చిత్రాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

  • Loading...

More Telugu News