: డీకే అరుణను ‘బొమ్మాళి’గా అభివర్ణించిన నిజామాబాద్ ఎంపీ కవిత!
గద్వాలను జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ కొన్ని నెలలుగా ఆందోళన నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈరోజు ఆమె తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న కొత్త జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా ఉందని ఆరోపిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి దీక్షకు దిగారు. దీనిపై నిజామాబాద్ ఎంపీ కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు కరీంనగర్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... డీకే అరుణను బొమ్మాళిగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద డీకే అరుణ నోరు పారేసుకోకూడదని కవిత సూచించారు. దానికి బదులుగా గద్వాల కోటలో విశ్రాంతి తీసుకోవాలని చురకలంటించారు. రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు ఎలా చేస్తే మంచిదో కేసీఆర్ కు బాగా తెలుసని ఆమె అన్నారు. భారతీయ జనతా పార్టీ నేత, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడిపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. హిందూ, ముస్లింల మధ్య గొడవపెట్టాలని ఆయన చూస్తున్నారని కవిత ఆరోపించారు. సెప్టెంబరు 17న తాము తెలంగాణ విమోచన దినం చేయడం లేదని, విలీనదినం చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.