: భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ కు అదృష్టం.. అనూహ్యంగా ‘కాంస్యం’ నుంచి ‘స్వర్ణ’ పతకానికి అప్ గ్రేడ్!


లండన్ ఒలింపిక్స్- 2012 లో 60 కిలోల ప్రీస్టైల్ విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ ను అదృష్టం వరించింది. ఎందుకంటే, అదే ఒలింపిక్స్ లో రజతపతకం సాధించిన రష్యా రెజ్లర్ బెసిక్ కుద్ కోవ్ శాంపిల్స్ పై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా) జరిపిన పరీక్షల్లో నిషేధిత డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో, ఆ రజత పతకాన్ని యోగేశ్వర్ కు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించడం తెలిసిన విషయమే. తాజాగా, మరో ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఇదే ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న అజర్ బైజాన్ రెజ్లర్ తోగ్రుల్ అస్గరోవ్ కూడా డోపీయేనని తేలింది. దీంతో అతనిపై కూడా వేటు పడనుంది. లండన్ ఒలింపిక్స్ కు ముందు అస్గరోవ్ ఇచ్చిన శాంపిల్స్ పరీక్షా ఫలితాలు పాజిటివ్ గా రావడంతో, ఆ స్వర్ణ పతకం యోగేశ్వర్ దత్ కు దక్కనుంది. కాగా, ఈ విషయమై అధికారిక ప్రకటన కోసం భారత రెజ్లింగ్ సమాఖ్య ఎదురుచూస్తోంది. యోగేశ్వర్ దత్ స్వర్ణ పతకం అందుకుంటే కనుక, బీజింగ్ ఒలింపిక్స్-2008లో వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించిన షూటర్ అభినవ్ బింద్రా సరసన యోగేశ్వర్ కూడా చేరతాడు.

  • Loading...

More Telugu News