: సీఎం చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్చాలా.. లేక బంగాళాఖాతంలో వేయాలా?: జగన్
ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న కరవు పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వహిస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. రాయలసీమ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించకపోవడంపై నిరసన తెలుపుతూ కడప జిల్లా కలెక్టరేట్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ... రైతుల కష్టాలను ప్రభుత్వానికి చెప్పేందుకే ఈరోజు మహాధర్నాకు దిగినట్లు పేర్కొన్నారు. కరవుపై మంత్రివర్గ భేటీ నిర్వహించని చంద్రబాబు అమరావతి నిర్మాణం అంటూ స్విస్ చాలెంజ్ కోసం మాత్రం మంత్రులతో భేటీ నిర్వహిస్తున్నారని జగన్ విమర్శించారు. కరవు పరిస్థితులపై రైతులను మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు. మేనేజ్మెంట్ టీంను తీసుకొచ్చి రెయిన్ గన్లు అందిస్తున్నది అందుకేనని అన్నారు. రైతుల సమస్యలపై గతనెల 12లోపు ప్రభుత్వం సమావేశం నిర్వహించాల్సి ఉండగా ఆ సమావేశాన్ని ఈనెల 15కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి రైతులమీద ప్రేమ ఉందా? లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కడపజిల్లా రాయచోటిలో ఏరియల్ సర్వే చేశారని జగన్ అన్నారు. సాధారణంగా వరదలు వచ్చినప్పుడు అటువంటి ఏరియల్ సర్వే నిర్వహిస్తారని.. కానీ, కరవు వచ్చినా చంద్రబాబు ఏరియల్ సర్వే చేశారని ఆయన ఎద్దేవా చేశారు. అటువంటి ముఖ్యమంత్రిని తానింతవరకు చూడలేదని ఆయన అన్నారు. శ్రీశైలంలో నీటిని రైతులకు అందివ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్చాలా? లేక బంగాళాఖాతంలో వేయాలా? అని ఆయన దుయ్యబట్టారు.