: వాటర్ ట్యాంకుల్లోనే 86 శాతం ప్రాణాంతక దోమలు.. ఈ ఏడాది 12,225 చికెన్ గున్యా, 27,879 డెంగ్యు కేసులు నమోదు
దోమల ద్వారా మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, మెదడువాపు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదముందన్న విషయం తెలిసిందే. సూది గుచ్చినట్లు మనకు నొప్పిని కలగజేస్తూ మనిషి ఒంట్లోని రక్తాన్ని తాగేసే దోమలు ఏయే ప్రాంతాల్లో అధికంగా ఉంటున్నాయన్న అంశంపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ రిపోర్టు తయారు చేసింది. దోమల్లో 86 శాతం మంచినీళ్ల ట్యాంకుల్లోనే ఉంటున్నట్లు పేర్కొంది. టెర్రస్ పైన ఉండే ట్యాంకులు, ప్లాస్టిక్ డ్రమ్స్, డిసర్ట్ కూలర్స్, ప్లవర్ పాట్స్, ఐరన్ కంటైనర్లు, కనస్ట్రక్షన్ సైట్లలోనే ఈ దోమలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలిపింది. దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను నివారించేందుకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తూ, కమ్యూనికేషన్ కాంపెయిన్లు నిర్వహించాలని సూచించింది. ఈ ఏడాదిలో గత నెల 31వ తేదీ వరకు వరకు 12,225 చికెన్ గున్యా కేసులు, 27,879 డెంగ్యు కేసులు నమోదైనట్టు పేర్కొంది. వచ్చే రెండు నెలల్లో ఈ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య మరింత పెరుగనుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాణాంతక దోమలు అధికంగా ప్లాస్టిక్ డ్రమ్స్లో 41 శాతం ఉంటున్నాయని తెలిపింది. డిసర్ట్ కూలర్స్లో 12 శాతం, కనస్ట్రక్షన్ సైట్స్లో ఎక్కువగా వాడే ఐరన్ కంటైనర్లలో 17 శాతం ఉంటున్నట్లు పేర్కొంది. ఈ నివేదికపై ఆరోగ్య కార్యదర్శి, కేబినెట్ సెక్రటరీ పీకే సిన్హా స్పందిస్తూ వాటి నివారణ కోసం అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోగులకు కావాల్సిన మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. వచ్చే వారం నుంచి వీటిపై డోర్ టూ డోర్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.