: ఇంట్లో పెంచుకునే మొక్కలో విషపదార్థాలు.. బాలుడికి తీవ్ర అస్వస్థత
మనం ఇళ్లలో, ఆఫీసుల్లో పెంచుకుంటోన్న మొక్కలన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడేవే అని అనుకోవద్దు. వాటిల్లో మనకు హాని కలిగించే మొక్కలూ ఉండొచ్చు. కొన్ని మొక్కల వల్ల ఆసుపత్రుల పాలయ్యే ప్రమాదం కూడా ఉంది. ప్రమాదకర మొక్కల్లో డిఫెన్‌బాకియా ఒకటి. చూడడానికి పెద్దగా ఉండే ఆకులతో, పూలతో చూడముచ్చటగా ఉండే ఈ మొక్కను ముట్టుకుంటే మన శరీరంలోకి విష పదార్థాలు ప్రవేశించే ప్రమాదం ఉంటుంది. ఈ మొక్కను ముట్టుకొని విదేశాల్లో ఎస్తెబన్ అనే ఐదేళ్ల చిన్నారి ఆసుపత్రి పాలయ్యాడు. ఇటీవలే ఆ చిన్నారి తమ ఇంట్లో ఆడుకుంటోన్న సమయంలో డిఫెన్‌బాకియా మొక్క వద్దకు వెళ్లి దాన్ని ముట్టుకొని అస్వస్థతకు గురయ్యాడు. మొక్కలోని విష పదార్థాలు ఆ బాలుడి శరీరంలోకి ప్రవేశించడంతో కడుపునొప్పి, వాంతులతో ఆసుపత్రిలో చేరాడు. బాలుడి ప్రాణాలకు ఏ ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. మొదట ఆ బాలుడి తల్లిదండ్రులు తమ బిడ్డ స్వీట్లు తినడం వల్లే అస్వస్థతకు గురయ్యాడని అనుకున్నారు. డిఫెన్‌బాకియా మొక్కవల్లే బాలుడు అస్వస్థతకు గురయ్యాడని ఆసుపత్రిలో చేర్చిన అనంతరం తెలిసింది. చూడడానికి ఆకర్షణీయంగా కనిపించే ఈ మొక్కలను ఇళ్లలో, ఆఫీసుల్లో పెంచుకోవద్దని, ఈ మొక్క వల్ల కడుపునొప్పి, వాంతులు, నోట్లో, గొంతులో మంట, దృష్టి లోపం, డయేరియా, కంటి నొప్పి, శరీరం ఉబ్బిపోవడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.