: న్యాయ వ్యవస్థలో కలకలం రేపిన జస్టిస్ చలమేశ్వర్!... కొలీజియం భేటీకి హాజరుకాని వైనం!


సుప్రీంకోర్టు కోలీజియం సమావేశానికి హాజరు కాలేనంటూ లేఖ రాసి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కలకలం రేపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ అధ్యక్షతన ఏర్పాటైన కొలీజియంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ చలమేశ్వర్... నిన్న సదరు కొలీజియం భేటీకి హాజరు కాలేదు. న్యాయమూర్తుల నియామకం, బదిలీల విషయంలో కీలక పాత్ర పోషించే కొలిజియంలో ప్రభుత్వం పాత్ర లేకపోతే పారదర్శక నియామకాలు జరగవని ఇదివరకే తన తీర్పులో జస్టిస్ చలమేశ్వర్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలో ఏర్పాటైన కొలీజియంలో జస్టిస్ చలమేశ్వర్ తో పాటు జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ కేఎస్ కేహార్, దిపక్ మిశ్రాలు సభ్యులుగా వున్నారు. కొలీజియానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన, మరిన్ని కీలక విషయాలపై చర్చించేందుకు చీఫ్ జస్టిస్ నిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ భేటీకి జస్టిస్ చలమేశ్వర్ హాజరు కాలేదు. అంతటితో ఆగని జస్టిస్ చలమేశ్వర్... కొలిజియానికి సంబంధించి భవిష్యత్తులో జరిగే సమావేశాలకు కూడా తాను హాజరుకాలేనని చీఫ్ జస్టిస్ కు ఓ లేఖ రాసినట్లు జాతీయ మీడియా పలు కథనాలను రాసింది. ప్రస్తుతం ఈ వ్యవహారంలో దేశీయ న్యాయవ్యవస్థలో పెద్ద చర్చే జరుగుతోంది.

  • Loading...

More Telugu News