: హోదాపై పవన్ స్పందించడాన్ని స్వాగతిస్తున్నాం, ధర్నాలు చేయడానికి మేం రెడీ: చలసాని శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై ధర్నాలు నిర్వహించడానికి తాము సిద్ధమవుతున్నట్లు ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు విజయవాడలో ప్రత్యేక హోదా సాధన సమితి సభ్యులు తమ భవిష్యత్ కార్యాచరణను తెలపడానికి మీడియా సమావేశం ఏర్పరచారు. ఈ సందర్భంగా చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ... అన్ని జిల్లాల్లో హోదా ప్రాముఖ్యతను గురించి తెలుపుతూ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. హోదాపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని అన్నారు. అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల ముందు త్వరలోనే ధర్నాలు నిర్వహించనున్నట్లు చలసాని తెలిపారు. తమకు అన్ని జిల్లాల ప్రజల నుంచి మద్దతు ఉందని అన్నారు. ఇటీవలే హోదా కోసం నిర్వహించిన రక్తదాన కార్యక్రమం విజయవంతమైందని, రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానం శిబిరాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. హోదాపై జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ స్పందించడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్యాకేజీలు వద్దు.. హోదానే కావాలని వ్యాఖ్యానించారు.