: నోరు అదుపులో పెట్టుకో!... లేదంటే నాలుక కోసేస్తా!: సినీ నటుడు శివాజీకి చిత్తూరు ఎంపీ వార్నింగ్!
ఏపీకి ప్రత్యేక హోదాపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న సినీ నటుడు శివాజీపై నిన్న టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. ఏపీకి ప్రత్యేక హోదా రానిపక్షంలో సీఎం చంద్రబాబు ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని, హోదా విషయంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని శివాజీ ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నిన్న చిత్తూరులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా శివాజీ వ్యాఖ్యలను ప్రస్తావించిన శివప్రసాద్... మరోమారు చంద్రబాబు, సుజనా చౌదరిల మాటెత్తితే నాలుక తెగ్గోస్తానని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఇటు రాష్ట్రం, అటు కేంద్రం మధ్య వారధిగా వ్యవహరిస్తున్న సుజనా చౌదరి... కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాంటి నేతను సీఎంకు తొత్తు అంటూ నిందారోపణలు చేయడం శివాజీకి తగదని హితవు పలికారు. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఇకనైనా మాట తీరు, పధ్ధతి మార్చుకోవాలని... లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని శివప్రసాద్ హెచ్చరించారు.