: 'నువ్వు రౌడీ' వంటే... 'నువ్వే రౌడీ' వంటూ 'లైవ్'లో బోండా...కోగంటి వాగ్వాదం


టీవీ9 లైవ్ లో ఈ సాయంకాలం ఆసక్తికర వాగ్వాదం చోటుచేసుకుంది. విజయవాడలో చోటుచేసుకున్న డుండీ గణేష్ ఉత్సవ కమిటీ వివాదం సందర్భంగా ఏర్పాటు చేసిన లైవ్ లో ఎమ్మెల్యే బోండా ఉమ, పారిశ్రామికవేత్త కోగంటి సత్యం మధ్య ఆసక్తికర వాగ్వాదం చోటుచేసుకుంది. బోండా ఉమ: నువ్వు (కోగంటి సత్యం) ఎన్నిసార్లు జైలు కెళ్లావో చెప్పాలి కోగంటి సత్యం: నా మీద ఒకే ఒక్క కేసు ఉంది... ఆ కేసు కూడా ఎందుకు ఉందంటే... నీ మీదున్న రౌడీ షీట్ ను అప్పటి సీఐ రామారావు కాళ్లు పట్టుకుని నువ్వు తీయించుకున్నావు. నేను అతని కాళ్లు పట్టుకోలేదు. దీంతో నా పైన కేసుంది, లేకపోతే ఆ కేసు కూడా ఉండేది కాదు. ఉమ: నువ్వు రౌడీవని పోలీసుల రికార్డులే చెబుతున్నాయి... నీపై మర్డర్ కేసులున్నాయి సత్యం: నువ్వు నా కుర్రాడివా? కాదా? అది ముందు చెప్పు ఉమ: నేను నీ దగ్గర పని చేశానా? నువ్వు నా దగ్గర గుమస్తాగా పని చేశావా? సత్యం: ఎవరు ఎవరి దగ్గర పని చేశారో విజయవాడలో అందరికీ తెలుసు... నేను నీ దగ్గర పని చేశానా?... నా పేరు చెప్పుకుని నువ్వు ఎన్నో సెటిల్ మెంట్లు చేసి డబ్బులు సంపాదించుకున్నది నిజం కాదా? ఉమ: దేవుడి కార్యక్రమంలో రాజకీయాలకు తావులేదు... వారు వారు చేసుకుంటే వివాదం ఏముంది? సత్యం: ప్రజా ప్రతినిధిగా నువ్వు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి... అలా కాకుండా నువ్వు మధ్యలో కల్పించుకుంటే ఎలా? ఉమ: ఇందులో రాజకీయం లేదా? నీ జీవితం గురించి నాకు చెప్పకు... నీ గురించి నాకు తెలియనివి ఉన్నాయా? సత్యం: నేను షోడాలు అమ్ముకుని జీవితంలో పైకి వచ్చాను... నువ్వు నాలాంటోళ్ల దగ్గర పని చేసి ఎదిగావు ఉమ: ఇప్పటికైనా మారు... రౌడీయిజం మానెయ్... నా నియోజకవర్గంలో రౌడీయిజానికి తావు లేదు సత్యం: నువ్వు రాజకీయ రౌడీవయ్యావు... నన్ను రౌడీ అంటావా? ఉమ: నేను 30,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాను సత్యం: అది నీ గొప్పతనం కాదు... చంద్రబాబు వల్ల నీకు లభించింది... అలా కాదు, నీ సత్తాతో గెలిచానని అనుకుంటే... ఇప్పుడు నీ పదవికి రాజీనామా చేసిరా... ఇద్దరం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేద్దాం... ఎవరు గెలుస్తారో తెలిసిపోతుంది. ...ఈ విధంగా వీరిద్దరి మధ్యా తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News