: విజయవాడ గణేష్ ఉత్సవ కమిటీలో విభేదాలు... బోండా, కోగంటి వర్గాలుగా విభజన
విజయవాడలో గణేష్ ఉత్సవాలు వివాదాస్పదంగా మారాయి. డుండీ గణేష్ సేవా సమితి పేరుతో గతేడాది 63 అడుగుల విగ్రహం ఏర్పాటు చేశారు. దీనికి విశేషమైన పేరు ప్రతిష్ఠలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది డూండీ గణేష్ ఉత్సవ సమితి పేరుతో కొత్త కమిటీ ఏర్పాటైంది. కమిటీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బోండా ఉమ ఎన్నిక కాగా, కార్యవర్గానికి పలువురు టీడీపీ నేతలను ఎన్నుకొన్నారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో బోండా ఉమ మాట్లాడుతూ, ఈ ఏడాది 72 అడుగుల ఎత్తుతో గణేష్ విగ్రహం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ ఏడాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. దీనిపై పారిశ్రామిక వేత్త కోగంటి సత్యం మాట్లాడుతూ, ఈ విషయం వారం రోజుల క్రితం చెబితే తాను 15 లక్షల రూపాయలు ఖర్చు చేసేవాడిని కాదని అన్నారు. తన మోచేతి నీళ్లు తాగి బతికిన బోండా ఉమ, ఇప్పుడు తనను రౌడీ షీటర్ అంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు కొత్తగా ఉత్సవ కమిటీ అంటున్నారని, ఉత్సవ కమిటీ పేరుతో హుండీ ఏర్పాటు చేసేందుకు, అభిషేకాల పేరుతో డబ్బులు వసూలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బోండా ఉమ గతంలో సీఐ రామారావు కాళ్లు పట్టుకుని తనపైనున్న రౌడీ షీట్ తీయించుకున్నాడని ఆయన విమర్శించారు. తాను నిజయతీపరుడును కనుక ఎవరి కాళ్లు పట్టుకోలేదని, అందుకే తనపై రౌడీ షీట్ ఉందని ఆయన అన్నారు. దీనిపై ఉమ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చెబుతున్నట్టు 30 లక్షల రూపాయలు అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారని, వాటి లెక్కలు చూపించాలని వారు డిమాండ్ చేశారు.