: 'ఆ దంపతులకు అంత అందమైన కూతురా!' అనే అనుమానమే కిడ్నాపర్లను పట్టించింది!
ఇరవై ఐదేళ్ల బసంత్, ఇరవై ఒక్కేళ్ల సుప్రియ భార్యాభర్తలు. వారితో ఒక అందమైన చిన్నారి కూడా ఉంది. అయితే, ఆ చిన్నారి ఆ దంపతుల కూతురు కాదేమోనన్న పోలీసుల అనుమానం ఆ జంట చేసిన కిడ్నాప్ వ్యవహారాన్ని బయటపెట్టింది. వివరాల్లోకి వెళితే.... ముంబయిలోని అంథేరి ప్రాంతానికి చెందిన వష్రా దావోస్ తన కుటుంబంతో కలిసి ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వేస్టేషన్ లో రైలు ఎక్కేందుకు వచ్చాడు. రైలు కోసం వేచి చూస్తున్నాడు. రైల్వేస్టేషన్ రద్దీగా ఉండటంతో వారి చిన్నారి వైష్ణవి కనిపించకుండా పోయింది. దీంతో, పాప తండ్రి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్ ను ఆధారంగా చేసుకుని రైల్వే పోలీసు ఇన్ స్పెక్టర్ సంతోష్ ధన్వతే ఒక ప్రత్యేక పోలీస్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. ఈ చిన్నారిని ఎత్తుకెళ్లిన వారు ఒక ట్యాక్సీ ద్వారా మసీదు, ఖోపాలి ప్రాంతాలకు వెళ్లారనే విషయం వారి దర్యాప్తులో తేలింది. ఈ చిన్నారి కోసం వెతుకుతున్న క్రమంలో దంపతులు బసంత్, సుప్రియలతో చిన్నారి వైష్ణవిని చూసిన పోలీసులకు అనుమానం కలిగింది. అంత అందమైన ఆ చిన్నారి వీరి కూతురు కాదేమో అన్న డౌటుతో, వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ దంపతులు గడిచిరోలి జిల్లాకు చెందినవారని, కూలి పనుల నిమిత్తం ముంబయికి వచ్చారని పోలీస్ విచారణలో తేలింది. ముంబయికి వచ్చిన వారు రైల్వేస్టేషన్ లో బాలికను కిడ్నాప్ చేసినట్లు తేలింది. కిడ్నాప్ నకు పాల్పడిన దంపతులను కోర్టు రిమాండుకు పంపింది. అసలు తల్లిదండ్రులకు వైష్ణవిని పోలీసులు అప్పగించడంతో కథ సుఖాంతమైంది.