: మోదీజీ! రిలయన్స్ యాడ్స్ కు మోడలింగ్ చేయండి: కేజ్రీవాల్ సూచన
'మోదీజీ, రిలయన్స్ యాడ్స్ కు మోడలింగ్ చేయండి' అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. జియో 4జీ సర్వీసులకు సంబంధించి రిలయన్స్ ప్రకటనల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను వాడటాన్ని ఆయన తప్పుపడుతూ పలు ట్వీట్ లు చేశారు. మోదీని మిస్టర్ రిలయన్స్ అని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. కాగా, ప్రధాని నరేంద్రమోదీ డ్రీమ్ ప్రాజెక్టు డిజిటల్ ఇండియాకు జియో సర్వీసులను అంకితం చేయనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. నాలుగు నెలలపాటు ఉచితంగా జియో సేవలన్నీ లభిస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో జియో ఇచ్చిన ప్రకటనల్లో ప్రధాని ఫోటోను వాడారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.