: బిగ్ బీ అమితాబ్ నోట గణేశ్ హారతి పాట!
ఈ వినాయకచవితికి గణేశ్ హారతి పాటను బాలీవుడ్ నట దిగ్గజం, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పాడారు. ముంబయిలోని సిద్ధివినాయక ఆలయ నిర్వాహకుల కోరిక మేరకే బిగ్ బీ ఈ హారతి పాట పాడారట. ఈ విషయాన్ని అమితాబ్ మీడియాకు తెలిపారు. ఈ హారతి పాటను తాను పాడాలని ఆలయ నిర్వాహకులు కోరగా, అందుకు తాను అంగీకరించానని, ముంబయిలోని ఆదేశ్ శ్రీవాస్తవ స్టూడియోలో పాటను రికార్డ్ చేశామని చెప్పారు. ఈ హారతి పాటను పాడింది తానే అయినా దీనిని కంపోజ్ చేసింది మాత్రం మ్యూజిక్ డైరెక్టర్లు రోహన్, వినాయక్ లని అన్నారు. ఈ హారతి పాటను పాటలా కాకుండా చిన్న మ్యూజిక్ వీడియోలా తయారు చేయాలనుకుంటున్నామని, ఈ పాట ఇంటర్నెట్, సీడీల్లోనూ లభిస్తుందని చెప్పారు. ఈ వీడియోనే దర్శకుడు శూజిత్ సర్కార్ చిత్రీకరిస్తారన్నారు.