: హాకీ మాజీ కెప్టెన్ ను కలుపుకుని సిద్ధూ కొత్త పార్టీ... పంజాబ్ వ్యతిరేకుల పీచమణిచేస్తామని హెచ్చరిక!
పంజాబ్ కు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ నేతల పీచమణిచేందుకే తాను కొత్త పార్టీని పెడుతున్నట్టు మాజీ క్రికెట్ స్టార్, బీజేపీ పదవికి రాజీనామా చేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ వ్యాఖ్యానించారు. తాను ఏ పార్టీలోనూ చేరబోనని, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్, అకాలీదళ్ నేత పర్గత్ సింగ్ తో కలసి తాను 'ఆవాజ్ - ఏ - పంజాబ్' పేరిట కొత్త పార్టీని పెట్టనున్నట్టు చెప్పారు. లూథియానాకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యేలు సిమర్జిత్ సింగ్ బైన్స్, బల్వీందర్ సింగ్ బైన్స్ తమతోనే ఉన్నారని, మరెంతో మంది మాజీ ప్రజా ప్రతినిధులు తమ పార్టీలో భాగస్వాములని తెలిపారు. పార్టీ విధానాలు, కోర్ కమిటీ తదితర వివరాలను 9వ తేదీ తరువాత తెలియజేస్తామని, సాధ్యమైనంత త్వరగా మ్యానిఫెస్టోతో పాటు పార్టీ తరఫున పోటీ పడే అభ్యర్థుల వివరాలనూ వెల్లడిస్తానని ఆయన అన్నారు. కాగా తన భర్త కొత్త పార్టీపై సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ స్పందిస్తూ, ఆప్ లేదా కాంగ్రెస్ లో చేరేందుకు తన భర్త మనసు అంగీకరించలేదని అన్నారు. అందువల్లే ఆయన కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారని, ఆయన ఆలోచనను తాను స్వాగతిస్తున్నానని చెప్పారు.