: జియో వాడితే మీ మొబైల్ బిల్లేమీ తగ్గదు!


రిలయన్స్ జియో ప్రకటించిన ఉచిత కాల్స్, డేటా తదితర ఆఫర్లు చూసి జియో సిమ్ కోసం పరుగులు పెడుతున్నారా? జియోకు మారినప్పటికీ, సాధారణ కస్టమర్లకు మొబైల్ బిల్లేమీ పెద్దగా తగ్గే అవకాశాలు లేవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎలాగంటే... గురువారం నాడు రిలయన్స్ జియో రూ. 149 నుంచి రూ. 4,999 మధ్య (పోస్ట్ పెయిడ్, పన్నులు అదనం) పలు రకాల టారిఫ్ ప్లాన్లను ప్రకటించింది. ఇవన్నీ 28 రోజుల వ్యాలిడిటీతో ఉంటాయి. ఎంట్రీ లెవల్ లో ఉన్న రూ. 149 ప్యాకేజీలో కేవలం 300 మెగాబైట్ల డేటా మాత్రమే లభిస్తుంది. 100 ఎస్ఎంఎస్ లు, ఉచిత కాలింగ్ సదుపాయాలు ఉన్నాయి. ప్రస్తుతం నెలకు సాధారణ నెట్ వినియోగదారులు వాడుతున్న డేటాతో పోలిస్తే, ఈ ప్యాకేజ్ ఎంతమాత్రమూ సరిపోదు. డేటా వాడుతున్న వారంతా నెలకు 300 మెగాబైట్ల వాడకాన్ని ఏనాడో దాటేశారు. దీంతో జియో ప్రకటించిన తదుపరి అందుబాటులోని ప్యాకేజ్ రూ. 499కు వెళ్లాలి. ఎందుకంటే, డేటా అవసరాలు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఎంతో ముఖ్యం కాబట్టి. ప్రస్తుతం సరాసరిన ఎయిర్ టెల్ వినియోగదారులు నెలకు 1 గిగాబైట్ల డేటాను వాడుతున్నారు. ఇదే సమయంలో డేటా వాడకం 10 శాతం కన్నా వేగంగా పెరుగుతోంది. జియో ఇస్తున్న రూ. 499 ప్యాకేజీలో 4 జీబీ డేటా లభిస్తుంది కాబట్టి, ఈ ప్యాకేజీని అత్యధికులు ఎంచుకోవచ్చు. ఈ రెండింటి మధ్యా రూ. 299కి 2 జీబీ డేటా అందించే మరో ప్లాన్ ఉన్నా, అది కేవలం 21 రోజులకు మాత్రమే పరిమితం. ఇక ప్రస్తుతం మొబైల్ ఫోన్ వినియోగదారుడు సగటున కాల్స్ చేసేందుకు వెచ్చిస్తున్న మొత్తం నెలకు రూ. 200 కన్నా తక్కువే. దీంతో పోలిస్తే, రెండున్నర రెట్లు అధికంగా రూ. 499 పెడితేనే జియో ప్యాక్ లభిస్తుంది. ఇక 500 ఎంబీ లేదా 1 జీబీ డేటా కూడా వాడతారని అనుకుంటే, ఎయిర్ టెల్, ఓడాఫోన్ తదితర కంపెనీలు గరిష్ఠంగా రూ. 250కి 1జీబీ అందిస్తున్నాయి. ఈ లెక్కన రూ. 450తో నెలంతా లాక్కొచ్చే కస్టమర్, జియోకు మారితే మరింత చెల్లించుకోవాల్సి వుంటుంది. ఇక్కడ అదనపు డేటా లభిస్తుందన్నది ఒక్కటే కస్టమర్ కు దక్కే లాభం. ఎటొచ్చీ కాల్స్, లేదా డేటా నిమిత్తం నెలకు రూ. 500కన్నా అధికంగా వెచ్చించే వారికి మాత్రం రూ. 499 ప్లాన్ మేలు చేస్తుంది. ఎందుకంటే కాల్స్, ఎస్ఎంఎస్ లు ఉచితం కాబట్టి. ఇండియాలోని 60 కోట్ల మంది మొబైల్ వినియోగదారుల్లో నెలకు రూ. 500 కన్నా అధికంగా సెల్ ఫోన్లకు కేటాయించే వారి సంఖ్య 5 కోట్లకు మించదని లెక్కలు చెబుతున్నాయి. ఇక భవిష్యత్తులో ఈ ధరలు మారిపోయే అవకాశాలే అధికం. ప్రస్తుతం జియో ప్రకటించిన ధరలు జనవరి 1, 2017 నుంచి అమల్లోకి వస్తాయి. ఎంత వరకూ ఇవే ధరలు కొనసాగుతాయన్న విషయాన్ని మాత్రం రిలయన్స్ వెల్లడించలేదన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News