: నమ్మిన బంటు కోరిక కాదనలేకపోయిన కేసీఆర్!... ఫలితమే తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ!
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టిన ఓటుకు నోటు కేసు దర్యాప్తు, గ్యాంగ్ స్టర్ నయీమ్ జాడ గుర్తింపు... తదితర కీలక కేసుల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి కీలక భూమిక పోషించారు. రాష్ట్ర విభజన సమయంలో విశాఖపట్నం పోలీసు కమిషనర్ గా ఉన్న శివధర్ రెడ్డిని... తెలంగాణ సీఎం కేసీఆర్ ఏరికోరి మరీ తెలంగాణకు రప్పించుకున్నారు. నాటి నుంచి తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డే వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ కు శివధర్ రెడ్డి నమ్మిన బంటుగానే పేరు పడ్డారు. అయితే నిన్న జరిగిన ఐపీఎస్ ల బదిలీల్లో భాగంగా ఇంటెలిజెన్స్ చీఫ్ లాంటి కీలక పదవి నుంచి శివధర్ రెడ్డిని తప్పించిన కేసీఆర్ సర్కారు... ఏమాత్రం ప్రాధాన్యం లేని డీజీపీ కార్యాలయంలోని పర్సనల్ విభాగానికి ఐజీగా నియమించింది. దీనిపై పోలీసు వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది. అయితే స్వయంగా శివధర్ రెడ్డి కోరిక మేరకే ఆయనను అంతగా ప్రాధాన్యం లేని శాఖకు ప్రభుత్వం బదిలీ చేసిందని సమాచారం. తీవ్రమైన పని ఒత్తిడితో సతమతమవుతున్న తనను వేరే శాఖకు బదిలీ చేయాలని శివధర్ రెడ్డే స్వయంగా కేసీఆర్ కు విన్నవించుకున్నారట. తాను నమ్మిన బంటుగా ఉన్న అధికారి అయిన శివధర్ రెడ్డి కోరిన కోరికను కాదనలేకపోయిన కేసీఆర్... ఆయనను ఇంటెలిజెన్స్ లాంటి కీలక శాఖ బాధ్యతల నుంచి విముక్తిడిని చేశారట.