: చైనా టూర్ కు నేడు మోదీ!...వియత్నాం మీదుగా డ్రాగన్ కంట్రీకి భారత ప్రధాని!
‘డ్రాగన్’ కంట్రీగా పేరుగాంచిన చైనా పర్యటనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు బయలుదేరనున్నారు. నేటి మధ్యాహ్నం ఢిల్లీలో ఫ్లైటెక్కనున్న మోదీ తొలుత వియత్నాం దేశంలో ఆగనున్నారు. వియత్నాం ప్రభుత్వ పెద్దలతో భేటీ కానున్న ప్రధాని... ఆ దేశానికి భారత్ చేసే సాయంపై చర్చలు జరుపుతారు. ఆ తర్వాత చైనా బయలుదేరనున్న మోదీ... ఆ దేశంలోని హాంగ్జూ నగరంలో జరిగే జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. చైనా, వియత్నాంల మధ్య ఇటీవల సంబంధాలు చెడిన నేపథ్యంలో మోదీ పర్యటన ఆ రెండు దేశాల్లో అగ్గిని రాజేసే అవకాశాలున్నట్లు సమాచారం. తనను ధిక్కరిస్తున్న వియత్నాంలో ఆగిన తర్వాతే... తన దేశంలో భారత ప్రధాని అడుగుపెడుతున్న వైనంపై చైనా కాస్తంత ఆగ్రహంగా ఉంది.