: సబ్సిడీ గ్యాస్ పై వాత!... నాన్ సబ్సిడీ గ్యాస్ ధర భారీగా తగ్గింపు!
ఇంధనం, గ్యాస్ ధరలపై నిర్ణయాధికారం చమురు సంస్థలకే దఖలు పడిన తర్వాత ఆ సంస్థలు తీసుకుంటున్న నిర్ణయాలు విమర్శలకు తావిస్తున్నాయి. సాధారణంగా ధరలను తగ్గిస్తే... అన్నీ తగ్గేవి. పెరిగితే అన్నింటి ధరలూ పెరిగేవి. అయితే నిన్న చమురు రంగ సంస్థలు ఓ అసంబద్ధ నిర్ణయాన్ని తీసుకున్నాయి. సబ్సిడీ గ్యాస్ ధరలను పెంచేసిన చమురు సంస్థలు... సబ్సిడీయేతర గ్యాస్ ధరను మాత్రం భారీగా తగ్గించేశాయి. 14.2 కిలోల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.2 మేర పెంచిన చమురు సంస్థలు... సబ్సిడీయేతర సిలిండర్ ధరను ఏకంగా రూ.20 మేర తగ్గించాయి. ఇక విమానం ఇంధన ధరలను కూడా చమురు సంస్థలు భారీగానే తగ్గించాయి. ఈ ఇంధనం ధరను ఒక్క కిలో లీటర్ పై రూ.1,795.50 మేర భారీ తగ్గింపును చమురు సంస్థలు ప్రకటించాయి.