: పంట ఎండిపోయే వరకూ చంద్రబాబు స్పందించలేదు!: వైఎస్ జగన్
రైతుల పంట ఎండిపోయే వరకూ ఏపీ సీఎం చంద్రబాబు స్పందించలేదని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లా గోరంట్లలో ఎండిపోయిన వేరుశనగ పంటలను ఆయన పరిశీలించారు. రైతుల సమస్యలను తెలుసుకున్న అనంతరం జగన్ మాట్లాడుతూ, పంటలు ఎండిపోకుండా కాపాడటంలో ప్రభుత్వం నెలరోజులుగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ఆ నిర్లక్ష్యానికి రైతులు నిండా మునిగిపోయారని విమర్శించారు. రెయిన్ గన్ వ్యవస్థ పదేళ్లుగా అందుబాటులో ఉన్నా, కొత్తగా తానే సృష్టించినట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. రెయిన్ గన్ లతో పంటను కాపాడామంటూ ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కనీసం ఇన్ పుట్ సబ్సిడి ఇచ్చి రైతులను ఆదుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.