: ప్రజలను ఎంత కాలం ఇలా మోసం చేస్తారు... మీ ప్యాకేజీతో ప్రజలకు లాభమేంటి?: ఎమ్మెల్సీ చెంగల్రాయుడు
కల్లబొల్లి కబుర్లు చెబుతూ ఎంత కాలం ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తారని ఎమ్మెల్సీ చెంగల్రాయుడు టీడీపీ నేతలను ప్రశ్నించారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రెస్ మీట్ పై ఆయన మాట్లాడుతూ, గతంలో సుజనా చౌదరి ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టారని, వాటిల్లో ఆయన చెప్పినవి ఎన్ని కార్యరూపం దాల్చాయో అందరికీ తెలిసిందేనని వ్యంగ్యంగా అన్నారు. ఆ క్రమంలోనే సుజనా చౌదరి మరోసారి ప్రెస్ మీట్ పెట్టారని ఆయన అన్నారు. బుందేల్ ఖండ్ తరహా సాయం అంటే ఏంటో ముందు ఆయనకు అవగాహన ఉందా? అని ఆయన నిలదీశారు. పోనీ ఆయన చెబుతున్నట్టే ప్యాకేజీకి ఓకే అందామని... అయితే ఈ ప్యాకేజీతో ప్రజలకు నేరుగా జరిగే ప్రయోజనమేంటని ఆయన ప్రశ్నించారు. నేతల అవసరాలు తీరడానికి ప్యాకేజీతో సర్దుకుపోతున్నట్టు అనిపిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా కాకుండా ప్యాకేజీ ఇవ్వడం వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనమేంటో వారే చెప్పాలని ఆయన నిలదీశారు.