: టీడీపీ నేతలు మళ్లీ డ్రామాలు మొదలెట్టారు: సినీ నటుడు శివాజీ
టీడీపీ నేతలు మళ్లీ డ్రామాలు మొదలు పెట్టారని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు శివాజీ మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పే లెక్కలు ఆయనకైనా అర్థమయ్యాయా? అని ప్రశ్నించారు. ఆయన చెప్పినట్టే ప్రత్యేకహోదా కాకుండా ఎక్కువగా నిధులు రాష్ట్రానికి ఇస్తారనుకుందాం. ఈ నిధుల వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? అని ఆయన నిలదీశారు. ఎంతసేపూ కేంద్రం ఎక్కువ డబ్బులిస్తామంటోంది, ఎక్కువ డబ్బలిస్తామంటోందని సుజనా చౌదరి చెబుతున్నారని, ఆ నిధుల వల్ల ప్రజలకు నేరుగా జరిగే మేలేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చే రాయితీలు, నిధుల వల్ల సుజనా చౌదరికే ఎక్కవ మేలు జరుగుతున్నట్టుందని ఆయన విమర్శించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టుపెట్టవద్దని ఆయన సూచించారు. టీడీపీ నేతల ప్రవర్తన చూస్తుంటే... రెండు రోజులు హడావుడి చేసి, తరువాత మేము పోరాడామని గొప్పగా చెప్పుకునేలా కనిపిస్తోందని, కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడేలా కనబడడం లేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.