: మెదక్ జిల్లాలో... క్షుద్రపూజలు చేస్తున్నారంటూ దంపతులపై దాడి
క్షుద్ర పూజలు చేస్తున్నారనే నెపంతో దంపతులపై నలుగురు వ్యక్తులు దాడి చేసిన సంఘటన మెదక్ జిల్లా పటాన్ చెరు మండలం ఐలాపూర్ తండాలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సుల్తాపూర్ శివారు గండిగూడేనికి చెందిన కృష్ణ, భారతి భార్యాభర్తలు. స్థానికంగా వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. కొన్నిరోజులుగా వీరి వ్యాపారం అంతగా సాగకపోతుండటంతో, ఏం చెయ్యాలనే విషయమై పలువురి సలహాలు అడిగారు. ఈ క్రమంలో ఎవరో చెప్పగా, అమావాస్య రోజున ఐలాపూర్ తండా సమీపంలోని మర్రిచెట్టుకు ఈరోజు పూజలు చేశారు. వీరిని గమనించిన ఐలాపూర్ తండాకు చెందిన మంగమ్మ, ఆమె కుటుంబసభ్యులు మోహన్, రమేష్, యాదగిరి ఆ దంపతులపై గొడ్డలితో దాడి చేశారు. క్షుద్రపూజలు చేస్తున్నారంటూ స్తంభానికి కట్టేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులను విడిపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేశారు.