: అచ్చం ఆ సినిమాలో హీరోలా లుంగీ చేతబట్టి పరుగులు తీసిన రాజకీయ నాయకుడు
మలయాళంలో రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన 'ఓరు ఇండియన్ ప్రనాయకథా' సినిమాలో ఆందోళనకు నేతృత్వం వహించిన హీరో, అది కాస్తా హింసాత్మకంగా మారడంతో చితకబాదుతున్న పోలీసుల నుంచి తనను తాను రక్షించుకునేందుకు లుంగీ చేతబట్టి పరుగులు పెట్టి తప్పించుకుంటాడు. అచ్చం అలాగే కేరళలో తాజాగా ఓ ఘటన చోటుచేసుకుని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే...ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) నేత షరాఫుద్దీన్ సోషల్ మీడియాలో ఓ చిన్న స్థాయి సెలబ్రిటీ. కేరళలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాల పంపిణీలో జాప్యాన్ని నిరసిస్తూ తమ సంస్థ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చట్టాన్ని గౌరవిస్తామని, హింస తమ విధానం కాదని, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని మీడియా ముందు కుండబద్దలు కొట్టాడు. ఇంతలో కార్యాలయం వెనుకగేటు నుంచి వెళ్లిన కొంతమంది ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ కు దీనిపై వినతి పత్రం ఇచ్చారు. ఇదే సమయంలో ముందు గేటు వద్ద ఆందోళన చేస్తున్న పలువురు లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇది హింసాత్మకంగా మారింది. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న పోలీసులు లాఠీలు ఝుళిపించారు. లుంగీల్లో వచ్చిన ఎంఎస్‌ఎఫ్ నేతల్ని, కార్యకర్తల్ని చెదరగొడుతుండగా, ఓ వ్యక్తి వారి మధ్యలోంచి లుంగీ పట్టుకుని పరుగులు తీశాడు. దీంతో అంతలా పరుగెడుతున్నది ఎవరా? అని మీడియా ఫోకస్ చేయగా ఉద్యమాన్ని విరమించేది లేదని బీరాలు పలికిన ఎంఎస్ఎఫ్ లీడర్ షరూఫుద్దీన్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనితో 'ఓరు ఇండియన్ ప్రనాయకథా' సినిమాలో హీరో పరుగును పోల్చుతూ మీడియాలో కథనాలు వెల్లువెత్తున్నాయి.