: తమిళనాట 'అమ్మ' మరో వరం... ప్రసూతి సెలవు ఏకంగా 9 నెలలకు పెంపు
తమిళనాడులో మరో ఎన్నికల హామీని ముఖ్యమంత్రి జయలలిత నెరవేర్చారు. ప్రభుత్వ ఉద్యోగినులకు ప్రసూతి సెలవును 9 నెలలకు పెంచుతున్నట్టు నేడు ప్రకటించారు. గతంలో ఆరు నెలల పాటు వేతనంతో కూడిన సెలవు ఇస్తుండగా, ఇప్పుడు దాన్ని 9 నెలలకు అమ్మ ప్రభుత్వం పెంచింది. "2011లో మా ప్రభుత్వం మెటర్నిటీ లీవును 90 రోజుల నుంచి ఆరు నెలలకు పెంచింది. ఇప్పుడు దాన్ని 9 నెలలకు పెంచుతున్నాం" అని ఏఐఏడీఎంకే శాసన సభ్యుల హర్షాతిరేకాల మధ్య జయలలిత అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాల కల్పనకు కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నట్టు ఆమె తెలిపారు. మదురై రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు కీల్ పాక్ ప్రభుత్వ ఆసుపత్రిలో, కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రుల్లో వాస్కులర్, కార్డియో, ప్లాస్టిక్ సర్జరీ, కిడ్నీ ఆపరేషన్లు జరిగేలా మౌలిక వసతులను కల్పించనున్నట్టు ప్రకటించారు.